నేడు జూలై 21 వ తేదీ
క్రీ.శ 1278 జులై 21 నాటి పామాపురం (మహబూబ్ నగర్ జిల్లా) శాసనంలో కాకతీయ రుద్రమదేవి పాలనలో విడెము మాదయగారు రాజుగారికి పుణ్యంగా పొన్నముచ్చ రామనాధదేవర నందాదీపానికి ఆ ఊరిలోగల గాంథి సుంకాలను (సుగంధద్రవ్యాలపై పన్నులు) యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [హెచ్.ఎ.యస్. 19 యం.యన్. 32].
అట్లే క్రీ.శ 1567 నాటి మన్నూరు (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మన్నూరు చెంన్న కేశవపెరుమాళ్ళ ముఖమండప కైంకర్యము తమ ఆచార్యులు కందాళ అప్పవణ్న అప్పంగారికి పుణ్యంగా కనపరితి తిమ్మయ్యంగారి కుమారుడు తిరుమలయ్య కైంకర్యము ఆచంద్రార్కమనిచెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం. 264].
అట్లే క్రీ.శ 1590 జులై 21 నాటి మథురాపురం (అనంతపురం జిల్లా) శాసనంలో వెంకటపతిరాయలు పెనుగొండనుండి రాజ్యం చేస్తుండగా మహానాయంకరాచార్య పోతం యరకదిరినాయని కోనపనాయనింగారి బంటు నల్లరనేని చింనప మథురాపురం చెంనకేశవ అళఘ పెరుమాళ్ళకు చెల్లే దేవరపల్లె చెరువు, కాలువ, చేలు దంపెట్ల గ్రామాన్ని యేలిపోయిన హండేదేవినాయడు స్వామివారి పొలాలకు అన్యాయంచేసి రొక్కధాన్యాలను పుచ్చుకొనుచు వచ్చిరి (Misappropriation). కావున ఆ రొక్కధాన్యాలను స్వామివారిపూజలకు సమర్పించునట్లు, దంపెట్ల గ్రామ రెడ్డి కరణాలు ఈ ధర్మాన్ని ఆచరించాలని చెప్పబడ్డది. [ద.భా.దే.శా. XVI నెం. 302].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.