ఒక చిన్నవాడు మనసుకు నచ్చిన రీతిలో సంపాదించిన జీవిత శకలాలు ఇందులో వున్నాయి.
పత్రికల్లో ఉద్యోగం చేసే జర్నలిస్టులకు అబద్దాలు రాసి లేక నిజాలు పాతేసి నాలుగు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మాయామర్మాలు లేకుండా ఉద్యోగం చేసుకుంటూ తమకు ఆసక్తి ఉన్న అంశాలపై ప్రమాదరహితమైన పరిశోధనలు చేసి యదార్థ జీవితాన్ని ఆవిష్కరించవచ్చు. పెద్ద పెద్ద లక్ష్యాలతో పెద్ద పెద్ద పనులకు తెలివైన వారిని ఎడిటర్లు పురమాయిస్తుంటారు.అమాయకపు పనుల మీద కొందరు చిన్న వారిని పంపుతూ కూడా వుంటారు. అలాంటి ఒక చిన్నవాడు మనసుకు నచ్చిన రీతిలో సంపాదించిన జీవిత శకలాలు ఇందులో వున్నాయి.
రాజుల మీద, రాచకుటుంబాల మీద, తెగ బలిసిన కలవారి మీదా మాత్రమే రష్యాలో సాహిత్య సృష్టి జరుగుతున్న వేళ నికోలాయ్ గోగోల్ అనే ఆసామి ఒక నిరుపేద గుమస్తా చలికోటు మీద ఒక కథ రాశాడు. సామాన్యులు కూడా కథా వస్తువులు కాగలరని రష్యా రాచయితలకు అంత వరకూ తెలీదు. అందువల్లనే యావత్ రష్యన్ సారస్వతం కూడా గోగోల్ గ్రేట్ కోట్ నుంచే పుట్టిందని డాస్తోవిస్కీ అప్పట్లో ప్రకటించాడు.
సామాన్యశాస్త్రం తొలి పుస్తకం -‘కోళ్ళ మంగారం మరికొందరు” పుస్తకానికి పతంజలి గారు రాసిన ముందుమాట ఇది. 2005 ఎప్రిల్లో వచ్చిన ఈ పుస్తకం కాపీలు ప్రస్తుతం లేవు. అప్పుడు చదివిన వారితో పాటు కొత్తగా సామాజిక మాధ్యమాలు విస్తరించిన సందర్భంలో ముఖ్యంగా నేటి తరం వారికోసం పుస్తకంలోని వ్యాసాలు రేపటి నుంచి ‘తెలుపు’లో చదవగలరు. అన్నట్టు, ఈ నిజజీవిత కథనాలు కందుకూరి రమేష్ బాబు 2002 నుంచి 2004 వరకు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుభందంలో ‘సామాన్యశాస్త్రం’ శీర్షిక కింద ప్రచురితమయ్యాయి. తర్వాత అదే పేరుతో రచయిత సామాన్యుల జీవిత రచనలు ఒక ఒరవడిగా రాసి ప్రచురించిన విషయం మీకు తెలుసు.
దినపత్రికల్లో మహానుభావుల జీవితాల మీదా, చలోక్తుల మీదా, చమత్కారాల మీదా, గొప్ప వారి జీవితల మీదా రకరకాల ఆర్టికల్స్ రావడం రివాజు. అట్టి దిన పత్రికల్లో తోపుడుబళ్ల వాళ్ళ మీదా, పుట్ పాట్ నివాసుల మీద, జోక్స్ పుస్తకాలు రాసే వాళ్ల మీదా రాయడం జర్నలిస్టుల సామాజిక దృష్టిలో వచ్చిన మార్పుకు సంకేతం. ఇలాంటి పని ఇంతకు ముందు కూడా జరగలేదని కాదు. ఇరవై ఏళ్ల క్రితం ఈనాడులో రావూరి భరద్వాజ గారు ఇట్టి పని చేశారు. అంతకు ముందు అనేక తెలుగు పత్రికల్లో అపుడపుడూ అనేక మంది రాశారు. కానీ కందుకూరి రమేష్ బాబుకు వారికీ కొంత తేడా ఉన్నది. ఇతనికి ఇది నచ్చిన పని.
ఇర్వింగ్ వాలెస్ అనే వాణిజ్య రచయిత వారానికి ఆరు రోజులు డబ్బుల కోసం రాసి, ఎడో రోజున తనకు నచ్చిన విషయాల మీద రాసేవాడు. అలాంటి రాతల్ని ‘సండే జంటిల్మన్’ పేరుతో ఒక పుస్తకం వేశాడు. నాకు అది చాలా నచ్చింది. ఆయనకు డబ్బులు సంపాదించి పెట్టిన మిగిలిన అన్ని పుస్తకాలు కలిపినా ఆ ఒక్క పుస్తకానికి సమానం కాదని నా అభిప్రాయం. నచ్చిన విషయాల మీద రాసిన రాతలు వేరే కారణాలతో రాసిన వాటికన్నా తప్పక బాగుంటాయి. కందుకూరి రమేష్ బాబు రాసుకున్న ఈ జీవిత చిత్రాలు ఆ కారణం వల్లనే చాలా హాయిగా, ఆసక్తికరంగా ఉన్నాయి.
నెమలి మీద ఎంత ఆసక్తికరంగా, అందంగా రాయవచ్చో ఊర పిచ్చుక మీద కూడా అంతే బాగా రాయవచ్చు. కాకపోతే రాయడం రావాలి. ఆ పని ఇష్టం కావాలి.
నెమలి మీద ఎంత ఆసక్తికరంగా, అందంగా రాయవచ్చో ఊర పిచ్చుక మీద కూడా అంతే బాగా రాయవచ్చు. కాకపోతే రాయడం రావాలి. ఆ పని ఇష్టం కావాలి. ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక వారు రమేష్ బాబుకు ఇష్టమైన విషయాల మీద రాయడానికి అనుమతి ఇవ్వడం రమేష్ బాబు అదృష్టం కింద లెక్క.
పుస్తకం చిన్నదీ ముందుమాట పెద్దదీ అని ఎవరైనా వెక్కిరిస్తారేమో అని ఎక్కువ రాయడం లేదు. ఇది నాకు నచ్చింది. రమేష్ ఇది బాగా రాశాడు.