Editorial

Saturday, November 23, 2024
ఆధ్యాత్మికంహే నమో బుద్ధాయ: మన నేల పొరల్లోని బౌద్ధం చెపుతున్న దమ్మం - ఎంఏ....

హే నమో బుద్ధాయ: మన నేల పొరల్లోని బౌద్ధం చెపుతున్న దమ్మం – ఎంఏ. శ్రీనివాసన్

Budda

తెలంగాణలో, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న బౌద్ధ చారిత్రక స్థలాల గురించి ఎన్నో సందర్భాల్లో తెలుసుకుంటూనే ఉన్నాం కాబట్టి, ప్రదేశాల గురించి కాకుండా బౌద్ధం ఈ నేలను తడిమిన చారిత్రక సందర్భం, గోదావరీ కృష్ణా నదుల మధ్య ప్రాంతానికి బౌద్ధాన్ని అక్కున చేర్చుకునే పరిస్థితులూ, బౌద్ధం ఇక్కడి ప్రజల జీవన విధానమైన చారిత్రక కాలం గురించి మాట్లాడుకుందాం.

బౌద్ధులు అనగానే తూర్పు ఆసియా దేశాలో, శ్రీలంకనో మన మెదళ్లలో స్ఫురిస్తుంది. అంతెందుకు లక్షలాది మందితో బౌద్ధం స్వీకరించి నవయాన బౌద్ధాన్ని ఆవిష్కరించిన అంబేద్కరూ, అయనతో పాటు నవ భౌద్ధులుగా మారి ఇప్పటికీ బౌద్ధాన్ని ఆచరిస్తున్న లక్షలాది మంది బౌద్ధులు గుర్తుకు రారు. ఎందుకంటే మనం ఈ దేశంలో మొదటి నుండీ వైదిక మతం ఉందనీ, అందరూ సంస్కృతమే మాట్లాడే వాళ్ళనే ఒక ఆచారిత్రక భావనను చిన్నప్పటినుండీ వింటూ, ఇప్పుడిక వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞానంతో ఈ దేశమంతా (అసలు దేశం అనే మాటే ఆధునిక భావన), శాస్త్రీయంగా చెప్పాలంటే భారత ఉప ఖండం లేదా జంబూ ద్వీపం అంతా వైదిక సంస్కృతిలోనే పుట్టిందని గట్టి నమ్మకాన్ని రోజూ నెమరు వేసుకుంటూ, నమ్మని వాళ్ళని నాస్తికుడనో, ఇది పాత తిట్టు అయిందని భావించి ఈ మధ్య కాలంలో కనిపెట్టిన కొత్త తిట్టు దేశద్రోహి అనో తిట్టి సంతోషిస్తుంటారు. ఈ సామాజిక నేపథ్యంలో బుద్ధ జయంతి రోజు బౌద్ధం గురించీ, మన తెలుగు నేల లో బౌద్ధం గురించీ మాట్లాడుకోవాల్సి ఉంది.

గంగకూ గోదావరికీ ఉన్నసంబంధం

మధ్య గంగా ప్రాంతం అంటే ఈనాటి బీహార్ ఉత్తర్ ప్రదేశ్ లలో గంగా తీర మైదానాల నుండి హిమాలయ పర్వత సానువుల వరకున్న ప్రాంతం క్రీస్తు పూర్వం ఏడూ-ఆరూ శతాబ్దాలలో, కొన్ని కొత్త ఆలోచనలకు, తాత్విక ధోరణులకు జన్మనిచ్చింది. జైన, బౌద్ధ, అజీవిక, లోకాయత – ఇవన్నీ నాస్తిక మతాలు, అంటే వేదాల్ని నమ్మని మతాలని అర్థం. ఇవన్నీ ఇక్కడ మొదలవడానికి కారణం మధ్య గంగా ప్రాంతంలో వైదిక మతం కాకుండా స్థానిక విశ్వాసాలూ, తాత్విక చింతన ఎదుగుతూ వైదిక మతానికి దీటుగా నిలిచాయి. ఇవి అక్కడ ప్రాచుర్యం పొందడానికి కారణం అక్కడ ఎదుగుతున్న మహా జనపదాల ఆర్థిక, సాంఘిక జీవనానికి అనుకూలంగా ఉండటమే. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే మన మధ్య గోదావరీ ప్రాంతం అంటే ఉత్తర తెలంగాణ తో కలిసి ఉన్న దక్కన్ ప్రాంతంలో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నాటికి ఏర్పడ్డాయి. మధ్య గంగా ప్రాంతంలో మగధ, అంగ, కోసల వంటివి మహాజనపదాలుగా ఎదుగుతున్నపుడు, వింధ్యకు కింద ఏకైక మహాజనపదంగా మధ్య గోదావరీ ప్రాంతంలో అశ్మక మహాజనపదం ఏర్పడి ఎదుగుతున్నది. అందుకే ఈ రెండు ప్రాంతాలూ తొలినాళ్ళ లోనే శ్రమణ సంప్రదాయానికి చెందిన జైన, బౌద్ధ, అజీవిక మతాల్ని ఆదరించాయి. వైదిక మతానికి ముఖ్య ప్రాంతంగా ఉన్న ఎగువ గంగా ప్రాంతాలు అంటే ఈనాటి పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ లలోని వైదిక మత విస్తరణను, బౌద్ధ, జైన, అజీవిక మతాలూ, చార్వాకుల తాత్వికత ఎదుర్కొని ఆ ప్రాంతాల వికాసానికి తోడ్పడ్డాయి. అందుకే గుప్తుల కాలం వరకు సమాజంలో ఈ శ్రమణ మతాలు ప్రజల ప్రధాన జీవన విధానంగా ఉండినాయి.

ఇక తెలంగాణాకు వద్దాం. అశ్మక మహాజనపదం అంటే ప్రధానంగా మధ్య గోదావరి లోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా మగధ వంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ ఇంకా వైదిక మత వ్యాప్తి జరుగలేదు, ఉన్నవన్నీ స్థానిక, ఆదివాసీ సమాజం నుండి ఎదిగిన గ్రామీణ మత విశ్వాసాలు. ఈ సందర్భమే ఇక్కడ గోదావరి పాయల మధ్య ఉన్న బావరి అనే కోసల నుండి వచ్చిన బ్రాహ్మణుడిని బుద్ధుడి సందేశం కోసం తన శిష్యులని పంపేలా చేసింది.

Nelakondapalli
Nelakondapalli

అశ్మక మహాజనపదం అంటే ప్రధానంగా మధ్య గోదావరి లోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా మగధ వంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ సందర్భమే ఇక్కడ గోదావరి పాయల మధ్య ఉన్న బావరి అనే కోసల నుండి వచ్చిన బ్రాహ్మణుడిని బుద్ధుడి సందేశం కోసం తన శిష్యులని పంపేలా చేసింది.

తెలంగాణ నేలకు బౌద్ధాన్ని తెచ్చిన బావరి

పాయలుగా చీలిన గోదావరి మధ్య ఉన్న ద్వీపంలో నివాసం ఉన్న బావరి కథ సుత్తనిపాత లోని పారాయణవగ్గ లో ఉంది. ఇది ఒక మైథలాజికల్ కథలాగా కాకుండా ఒక చారిత్రక కథనం లాగానే ఉంటుంది. మగధ ప్రాంతంలో బుద్ధుడు అనే వాడు ఎదో కొత్త విషయాన్నీ చెపుతున్నాడని తెలుసుకున్న బావరి దానిని విని రమ్మని పదహారు మంది శిష్యులను పంపుతాడు. వాళ్ళు అశ్మక ప్రాంతం నుండి ముళక జనపదం లోని ప్రతిష్ఠానం (పైఠాన్) నుండి, ఉజ్జయిని ఇంకా అనేక నగరాలూ, పట్టణాలు దాటుకుని వెళ్లి శ్రావస్తి లో బుద్దుడి ఉపదేశాన్ని వింటారు.

ఇక మహా విహారాలు, బౌద్ధ విస్తృతికి ఉదాహరణలుగా కోటిలింగాల, దూళికట్ట, కొండాపూర్, ఫణిగిరి, చైతన్యపురి (హైదరాబాద్), నాగార్జునకొండ, ధాన్యకటకం, బావికొండ, శాలిహుండం వంటివి మన ముందుంటాయి.

వాళ్లలో 15 మంది అక్కడే ఉండి పోగా పింగీయ అనే వాడు మాత్రం వెనక్కి వచ్చి బుద్ధుడి తత్వాన్ని మొదటి సారి గోదావరి ప్రాంతానికి పరిచయం చేస్తాడు. అందుకే బుద్ధుడు బతికున్న కాలం లోనే బౌద్ధం ఈ నేలపై ప్రసరించింది. ఆ తర్వాత ఏ రకంగా అది విస్తృతి చెందిందనడానికి మనకు పురాతత్వ ఆధారాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం వరకు లేవు, కేవలం సాహిత్య ఆధారాలు మాత్రం అవి కూడా కొన్ని మాత్రమే ఉన్నాయి, ఇంకా ఎక్కువ పరిశోధన జరగాల్సి ఉంది.

బౌద్ధం ప్రజల మతం ఎట్లా అయింది?

అశ్మక మహాజనపదంలో ఎదుగుతున్న వ్యవసాయిక సమాజానికి కావాల్సిన ఆలోచనలను, తాత్వికతను, అన్ని వర్గాలను కలుపుకుపోయే బౌద్ధం అందచేసింది. వైదిక మతంలో లాగా వర్ణ బేధాలు లేక పోవడంతో, వ్యవసాయ సమాజం, చేతి వృత్తులు విస్తరించాయి. వర్తకాన్ని కూడా బౌద్ధం ప్రోత్సహించింది. దీంతో సమాజంలో ఉన్న ఉత్పత్తి, వర్తక వర్గాలు బౌద్ధాన్ని తమదిగా చేసుకున్నాయి. వైదిక మతం రాజులు, బ్రాహ్మణ వర్గాల ఆదరణతో ఎదిగితే బౌద్ధం మాత్రం ప్రజలే పునాదిగా విస్తరించింది. అందుకే శాతవాహనులు మొదలు విష్ణుకుండి రాజ్యం వరకు రాజులు తమ పాలనకు కావాల్సిన పవిత్రత, సాధికారతను అశ్వమేధ, రాజసూయ వంటి వైదిక యాగాలతో సాధించుకుంటున్నా, వారి భార్యలు, అధికార వర్గానికి చెందిన స్త్రీలు బౌద్ధ విహారాల్ని నిర్మించడం, దానాలు ఇవ్వటం చేసిన శాసనాలు, ఆధారాలు విస్తృతంగా దొరుకుతాయి.

 

ఈ మధ్యే మెదక్ జిల్లాలో మంజీరా నది ఒడ్డున నాగసాన్ పల్లిలో కానీ పెట్టిన రాక్ షెల్టర్ పై ఉన్న తొలి శాతవాహన కాలం మూడు బౌద్ధ లఘు శాసనాలు (హే నమో బుద్ధాయ, దమ్మ, హే జమ), మనం ఇంకా ఏంటో శోధించాల్సి ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

మన తెలుగు ప్రాంతాల్లోనే కాదు బౌద్ధానికి ఉన్న విస్తృత పునాది మొత్తం గహపతులు (వ్యవసాయదారులు), చేతి పని వాళ్ళు, వర్తకులు నిర్మించిందే. ఎందుకంటే ఈ వర్గాలన్నింటికీ కావాల్సిన భౌతిక, భౌద్ధిక సహాయం బౌద్ధ మతం చేసింది. బౌద్ధ విహారాలు ప్రజలకు విద్యాలయాలుగా, వైద్యశాలలుగా, వర్తక బిడారులకు మజిలీలుగా, భౌతిక అవసరాలను తీర్చినాయి. త్రిరత్నాలైన బుద్ధం, ధమ్మం, సంఘం ప్రజల నోళ్ళలో నానింది. ఊరూరా బౌద్ధ స్థూపాలు వెలిసినాయి, వాటిలో చాలా స్తూపాలు ఉద్దేశిక స్తూపాలైనప్పటికీ కొన్ని ముఖ్య విహారాలు బుద్ధుడి లేదా ప్రముఖ బౌద్ధ భిక్కువుల అవశేషాలతో ఉన్న ధాతు పేటికలతో కట్టడం జరిగింది. ఇప్పుడు మన కాలంలో గుడి లేని ఊరు లేనట్టే క్రీస్తు పూర్వం 3 నుండి క్రీస్తు శకం 6 వరకు బౌద్ధ విహారాలు లేదా కనీసం చిన్న ఉద్దేశిక స్తూపాలు ఉండేవని మన పురావస్తు తవ్వకాల్లో తెలుస్తున్నది. అందుకే ఒక వైపు పెద్దపల్లి జిల్లా ధూళికట్టలో మహాస్థూపాలు దొరికితే నల్గొండ జిల్లా పజ్జూరులో చిన్నసైజు చైత్యపు ఆనవాళ్లు దొరుకుతున్నాయి. గోదావరి, మంజీరా, మానేరు, భిక్కేరు, మూసి, కృష్ణాల నుండి రోమన్లతో చేసిన వర్తకం కథ, మనకు దొరికిన రోమన్ బంగారు నాణేలు చెపుతాయి.

ఇక మహా విహారాలు, బౌద్ధ విస్తృతికి ఉదాహరణలుగా కోటిలింగాల, దూళికట్ట, కొండాపూర్, ఫణిగిరి, చైతన్యపురి (హైదరాబాద్), నాగార్జునకొండ, ధాన్యకటకం, బావికొండ, శాలిహుండం వంటివి మన ముందుంటాయి. కృష్ణానదీ లోయలోని సిరిపర్వతం నలంద కంటే ముందే ఒక విశ్వవిద్యాలయానికి నెలవైంది. సింహళ, చైనా, తమిళ, కశ్మీర వంటి సుదూర ప్రాంతాల భిక్కులు కృష్ణా తీరంలో బౌద్ధాన్ని నేర్చుకోవడమే కాదు, దానికి విస్తృతినీ, పరిణతిని కల్పించారు. బౌద్ధ శిల్ప కళలో విశిష్టమైందిగా ఉన్న అమరావతి శైలికి అత్యున్నత రూపంగా ఫణిగిరి శిల్పం పురావస్తు తవ్వకాల్లో దొరికింది. తెలంగాణ లో కారుకొండ రామవరం, ఆంధ్రప్రదేశ్ లో శంకారం, గుంటుపల్లి వంటి రాతిని తొలిచి కట్టిన బౌద్ధ విహారాలు మనల్ని ఇప్పటికీ పలకరిస్తున్నాయి. ఈ మధ్యే మెదక్ జిల్లాలో మంజీరా నది ఒడ్డున నాగసాన్ పల్లిలో కానీ పెట్టిన రాక్ షెల్టర్ పై ఉన్న తొలి శాతవాహన కాలం మూడు బౌద్ధ లఘు శాసనాలు (హే నమో బుద్ధాయ, దమ్మ, హే జమ), మనం ఇంకా ఏంటో శోధించాల్సి ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ తొలి చారిత్రిక యుగం నుండి 6 వ శతాబ్దం వరకు హీనయానం నుండి వజ్రయానం వరకు దొరికిన ఆనవాళ్లు చాలవా… మన నేల పొరల్లో బౌద్ధమే ఉందని చెప్పడానికి? ఇంత విస్తరించిన బౌద్ధం క్రమేపీ కనుమరుగు కావడానికి కారణాల్ని మనం మరో సందర్భంలో చర్చిద్దాం.

 

srinivasan

ఎంఏ. శ్రీనివాసన్, చరిత్ర, పురాతత్వ పరిశోధకులు, జనరల్ సెక్రటరీ, పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్, తెలంగాణ.

ఫోన్ నంబర్. 8106935000. EMAIL: MA.VAASU@GMAIL.COM

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article