Editorial

Saturday, November 23, 2024
Peopleఅక్విన్ మాథ్యూస్, IPF : Hats off to you Director

అక్విన్ మాథ్యూస్, IPF : Hats off to you Director

ఫొటోగ్రఫీ ఫెస్టివెల్ కి మన భాగ్యనగరాన్ని ఆసియాలోనే కేంద్రంగా మలవడంలో ఈ యువకుడు విజయం సాధించారు. ఈ సాయంత్రం ఇండియన్  ఫోటో ఫెస్టివెల్ హైదరాబాద్ లో పదవ సారి జరుగుతుందీ అంటే ఇతడి దీక్షా దక్షతలు, పట్టుదలే కారణం. వారికి అభినందనలు తెలుపుతూ పండుగ వివరాలు తెలుపు కథనం ఇది.

కందుకూరి రమేష్ బాబు

హైదరాబాద్ కేంద్రంగా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ సాయంత్రం ఇండియన్ ఫొటో ఫెస్టివల్ పదవ ఎడిషన్ ప్రారంభం అవుతున్నది. ఈ రోజు మొదలై జనవరి 5 వరకు అంటే దాదాపు నెలన్నర పాటు ఈ వేడుక జరుగుతుంది. ప్రతి రోజూ పదిన్నర నుంచి సాయంత్రం ఏడు వరకు ఎవరైనా సందర్శించవచ్చు. ప్రవేశం ఉచితం.

ఈ వేదికలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఫోటోగ్రాఫర్లతో పాటు మన దేశంలో ప్రసిద్ది చెందిన ఫొటోగ్రాఫర్ల వరకూ ఎందరో పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ వేడుకకు నడుం కట్టింది అక్విన్ మాథ్యూస్. అతడి కృషి పట్టుదల కారణంగా ప్రభుత్వాలు మారినా నిరాటంకంగా పదేళ్లుగా మన భాగ్యనగరం ఈ పండుగకు వేదికగా మారింది. ఈ నెలన్నర రోజుల పాటూ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లోని నాలుగు అంతస్తుల్లోని ఆరు గ్యాలరీలలో ప్రింట్, డిజిటల్ ఫోటోగ్రఫీ ప్రదర్శనలు జరుగుతాయి. అలాగే మనం కలవడానికి కూడా కుదరని ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్లు ఈ వేడుకకు వక్తలుగా హాజరై వారి జీవితకాల కృషిని వివరిస్తారు.

అంతేకాదు, ప్రముఖ ఫొటోగ్రాఫర్లతో ఆసక్తి ఉన్న వారు ఇక్కడ ఏర్పాటు చేసే వర్క్ షాప్స్ లో పాల్గోనవచ్చు. అలాగే ప్రతి ఏడూ ప్రపంచ వ్యాప్తంగా ఆహ్వానించిన పోట్రేయిట్ ప్రైజ్ విభాగానికి ఎంపికైన ఫొటోగ్రాఫర్లకు కూడా బహుమతుల ప్రదానోత్సాహం ఉంటుంది. పోటీల్లో ఎంపికైన ఇరవై మంది తీసిన ఫోటోలు కూడా ప్రదర్శిస్తారు. మొత్తంగా ఒక ఫిలిం ఫెస్టివల్ మాదిరే ఈ ఫోటోగ్రఫీ ఈవెంట్ గొప్ప పండుగ మాదిరి హైదరాబాద్ లో జరగడానికి అన్ని హంగులతో ఏర్పాటైన ఈ వేడుక అందరికీ సాదర ఆహ్వానం పలుకుతుంది. ఆసక్తి ఉన్న వారు https://www.indianphotofest.com/ అన్న ఈ వెబ్సైట్ లో వివరాలు చూసి వారి వీలును బట్టి హాజరవచ్చు.

Frans Lanting

ఈ సారి ఫోటోగ్రఫీ గురించి మాట్లాడేందుకు వక్తలుగా పద్నాలుగు మంది ప్రముఖ ఫోటోగ్రాఫర్లు వస్తున్నారు. ఈ సాయంత్రం కీనోట్ ప్రసంగం చేయడానికి నేషనల్ జాగ్రఫీ ఫోటోగ్రాఫర్ ఫ్రాన్స్ లాంటింగ్ వస్తున్నారు.

Matt Stuart work

కాగా ఈ పదో ఎడిషన్ లో 35 ప్రింట్ ఎగ్జిబీషన్లు, 11 డిజిటల్ ఎగ్జిబీషన్లు ప్రదర్శిస్తున్నారు. ఐదుగురు ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్లు వర్క్స్ షాపులు నిర్వహిస్తున్నారు. కొందరు పోర్ట్ ఫోలియో రివ్యూలు చేస్తారు కూడా. అందులో నేషనల్ జాగ్రఫీలో పనిచేసే వారూ ఉన్నారు. అలాగే స్ట్రీట్ ఫొటోగ్రఫీలో విఖ్యాతి చెందిన Matt Stuart ని కూడా మనం ఇక్కడ కలుసుకోవచ్చు. అయితే వర్క్ షాపుల్లో పాల్గొనే వారు ఇంతకు ముందే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉండింది.

Reza Deghati  

2015లో ప్రారంభమైన ఈ పండుగకు మనదేశం గర్వించదగ్గ రఘురాయ్ మొదలు అంతర్జాతీయంగా పేరొందిన రెజా డేఘాటి తదితరులు హాజరయ్యారు. మన దగ్గర డి. రవీందర్ రెడ్డి, విశ్వేందర్ రెడ్డి వంటి వారు తప్పక ఉంటారు. ఒక్క మాటలో తలపండిన ఫోటోగ్రాఫర్ల నుంచి ఒత్సాహికుల దాకా అందరూ ఒక్క చోట చేరి అనుభవాలు కలబోసుకోవడం, ప్రేరణ పొందడం నిజంగానే వేడుక.

ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతూ కూడా ఈ పండుగ నిర్వహిస్తున్న ఫెస్టివల్ డైరెక్టర్ అక్విన్ మాథ్యూస్ కి, వారి టీంకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరింత ఉత్తేజంగా ఎన్నో ఏళ్ళు ఇలాగే నిర్వహించాలని మనసారా ఆకాంక్షిస్తూ అందరి తరపునా అభినందనలు.

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article