ఒకటి మాత్రం సత్యం. మీరు చేసిన పనులే చేయండి. లేదా చేయాలనుకున్న పనులు చేయండి. కానీ అధికారంతో చేయండి. యేగార్ మాదిరిగా…
కందుకూరి రమేష్ బాబు
బోరిస్ వాసిల్యేవ్ రచించిన ‘హంసలను వేటాడొద్దు’ అన్న నవల అనేక విధాలా స్ఫూర్తినిస్తూ ఉంటుంది. నాకే కాదు, చదివే ప్రతి ఒక్కరికీ అలాంటి స్ఫూర్తి ఇస్తుందనే నా నమ్మిక.
ముఖ్యంగా “నేను మొదలు పెట్టిన పాట చివరికంటా పాడుతాను” అని రచయిత ఒక చోట స్వగతంలో అన్నట్టు, ఈ నవలలోని కథా నాయకుడు కూడా తన జీవితాన్ని ఒక పాటలా చివరికంటా పాడుతాడు. ప్రకృతిలో తానొక అందమైన బాధ్యతను నిర్వహించిన వ్యక్తిగా కన్నుమూస్తాడు. ఇప్పుడు ఆ పాట అడవుల్లో కొండకోనల్లో మాదిరి సహృదయుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది.
యెగార్ పోలుష్కిన్ అన్న ఈ నవలా నాయకుడు అతి సాధారణమైన వ్యక్తి. సున్నిత మనస్కుడు. ఎంతో భావుకుడు. తాత్వికుడు. నిజాయితీ పరుడు. స్వార్థ చింతన లేనివాడు. సౌందర్యాధకుడు. యోధుడు. మనిషిని, ప్రకృతినీ గౌరవిస్తాడు. మనసు పెట్టి పని చేస్తాడు. కానీ లౌకికుల దృష్టిలో అతడు ఏమీ చేతకానివాడు. అదే ఈ నవలను ఇతర నవలలు భిన్నంగా మార్చింది.
మరి, ‘అసమర్థుడు’ అని అందరూ భావించిన ఆ వ్యక్తి, చేతగాని వాడుగా ప్రతి ఒక్కరి చేత చీత్కారింపబడ్డ ఆ వ్యక్తి, అందరి మూలంగానూ అపరాధ భావనకు గురిచేయబడిన ఆ వ్యక్తి – ఎందుకు స్ఫూర్తినిస్తూ ఉంటాడూ అంటే అతడు తన ఆత్మబలంతో జీవించినందువల్ల. ఇదివరకు వేరే వాళ్ళు చేసినట్టు కాకుండా తనదైన పద్దతిలో తాను ముందుకు సాగినందువల్ల. తన జీవితం తనకోసమూ, సమాజం కోసమూ అని గ్రహించి నందువల్ల కూడా. అంతేకాదు, తనను తాను నమ్మి, ఉన్న చోట తన కార్యాచరణతో నల్ల చెరువును తెల్లటి హంసలతో సజీవం చేసినందువల్ల.
నవల మధ్యకల్లా అతడికి అధికారం లభిస్తుంది. అటవీ అధికారిగా తన క్షేత్రానికి తిరిగి వస్తాడు. ఇక అక్కడి నుంచి అతడొక ఎదురులేని నాయకుడిగా మనకు కనిపిస్తాడు. తనకు అధికారం లభించగానే అప్పటిదాకా అసమర్థుడిగా కనిపించిన ఆ వ్యక్తే సమాజంలో అందరి మన్ననలు పొందే వ్యక్తిగా కన్పిస్తాడు. అదే ఈ నవల విశేషం. మీతో పంచుకునే ఈ వ్యాసానికి అదే మూలం.
చిత్రమేమిటంటే, తాను అంతకు ముందు ఎలా పని చేశాడో అటవీ అధికారిగా కూడా అలాగే పని చేసినప్పటికీ తాను చేబట్టిన అధికారం అతడిని అమోదకరమైన వ్యక్తిగా మారుస్తుంది. సమాజం ఇక అతడిని అధికారిగా చూడటం నేర్చుకోవడం వల్ల నిజానికి ఆ సామాన్యతే విశేషంగా కన్పిస్తుంది.
‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న నా రచన చదివిన వారు ‘సామాన్యుడు అయ్యాక ఆ మనిషి ఎలా ఉంటాడు?’ అని అడుగుతారు. అప్పుడు నేను యెగార్ వైపు చూపించి ‘ఇలా ఉంటాడు’ అని చెబుతుంటాను.
నిజానికి… ఎవరైనా నిన్న చేసిన పనే నేడు చేస్తారు. రేపూ అదే చేస్తారు. ఐతే ఈ నవలలో అధికారం అన్నది అతడు ఎప్పుడో స్వీకరించినప్పటికీ సమాజం ఆలస్యంగా కళ్ళు తెరుచుకున్నందు వల్ల అతడు ఒక కథా నాయకుడిగా నవల మధ్య నుంచి అరుదెంచుతాడు.
‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న నా రచన చదివిన వారు ‘సామాన్యుడు అయ్యాక ఆ మనిషి ఎలా ఉంటాడు?’ అని అడుగుతారు. అప్పుడు నేను యెగార్ వైపు చూపించి ‘ఇలా ఉంటాడు’ అని చెబుతుంటాను.
ఇలా మన మధ్య ఉన్న వారిని చూసేందుకు ఒక ప్రవేశిక గా కూడా ఆ పుస్తకం ఇస్తుంటాను. అంతేకాదు, సామాన్యుడు హీరోగా వ్యక్తమయ్యే సంపూర్ణ రచన ఏదీ అంటే నాకు అత్యంత విశ్వసనీయమైన ఉదాహరణగా కూడా యెగార్ ని శ్రద్దగా చిత్రించిన ఈ నవల కన్పిస్తుంది. అందుకే కానుకగా ఇస్తుంటాను.
నిజానికి సామాన్యులు అధికారికంగా పనిచేస్తారు. అది గుర్తించడం మొదలైతే మనందరి గౌరవాభిమానాలను వారు తప్పక పొందుతారు. ఎవరూ గౌరవించక పోయినా వారు అధికారంతో ఆ పని చేస్తూనే ఉంటారు. అయితే, ఆ సత్యం చెప్పకనే చెప్పడానికి కూడా నేనీ నవలను చాలా మందికి కానుకగా ఇస్తాను. అంతేకాదు, ఏవో కారణాలతో కొందరు అటూ ఇటూ తడుముకుంటూ ఉండవచ్చు. కొంచెం సందేహంతో తటపటాయిస్తూ అర్ధమనస్కంగా పనులు చేస్తూ ఉండవచ్చు. అలా వొద్దు. మీరూ సామాన్యంగా మీ జీవితానికి నాయకత్వం వహించడానికి ఒక పెద్ద అడుగు నేడే వేయండి. యెగార్ మాదిరిగా మీ గురించి కూడా ఎందరో ఏమేమో అనుకుంటూ ఉండవచ్చు. వాటిని పట్టించుకోకండి. ఒక వేళ మీకీ సమస్య లేకపోయినా సరే, మీరు అధికారికంగా మిమ్మల్ని మీరు అంగీకరించక పోతే ఆ పని తక్షణం అవసరం. అందుకు ఆలంబనగా మనసుకు ధైర్యంగా ఉంటుందని కూడా ఈ రచన మీరు చదవండి అని ఇస్తూ ఉంటాను. ఈ చిన్న ఉపోద్గాతం రాస్తున్నది కూడా అందుకే. ఎవరి జీవితాలను వారు త్రోటు పడకుండా జీవించమని చెప్పేందుకే.
ముఖ్యంగా రెండు కార్యరంగాల వారికి నేను ఇదే చెబుతాను. ఒక ఫోటోగ్రాఫర్ కావాలని వచ్చే వారికి అతడిని ఉదహరణీయమైన వ్యక్తిగా పరిచయం చేస్తూ ఈ పుస్తకాన్ని ఇస్తాను. అలాగే, ‘నేనొక రచయితను కావాలనుకుంటున్నాను’ అని ఎవరైనా చెబితే తప్పకుండా అతడి కథ చదవమని ఈ పుస్తకాన్ని చేతుల్లో పెడుతాను.
గొప్ప కిటుకు ఏమిటీ అంటే ఎప్పుడైతే మీ అంతట మీరు అధికారాన్ని స్వతంత్రంగా చేబూనుతారో అక్కడి నుంచి మీరు చేపట్టే పని అత్యంత సునాయాసం అవుతుంది.
ఒకటి మాత్రం సత్యం. మీరు చేసిన పనులే చేయండి. లేదా చేయాలనుకున్న పనులు చేయండి. కానీ అధికారంతో చేయండి. ఆ అధికారం ఎవరో ఇచ్చేదాకా వేచి చూడకండి. యెగార్ లా మొదటి నుంచి అధికారిగా ఉండండి. మీకు సరిపడే అవశ్యమైన అధికారం మధ్యలో తప్పక వస్తుంది. అప్పుడు సర్వ జనులూ మిమ్మల్ని అంగీకరిస్తారు.
గొప్ప కిటుకు ఏమిటీ అంటే ఎప్పుడైతే మీ అంతట మీరు అధికారాన్ని స్వతంత్రంగా చేబూనుతారో అక్కడి నుంచి మీరు చేపట్టే పని అత్యంత సునాయాసం అవుతుంది. ఇక ఉత్తమ స్థాయిలో మీ రచన వ్యక్తమవుతుంది. జీవితం ఆ నాటి నుంచే అపురూపంగా ప్రకాశిస్తుంది కూడా.
అది పెన్ను పట్టుకోవడం కావొచ్చు, కెమెరా ధరించడం కావొచ్చు. అశ్వాన్ని అధిరోహించి ఒక అటవీ అధికారిగా చిమ్మచీట్లోకి వెళ్లి శత్రువుల భరతం పట్టడమూ కావొచ్చు. మనసా వాచా కర్మణా ఒక అధికారంతో ఆ పనిలోకి దిగండి. మీరు మీ యేగార్ మాదిరిగా తిరిగి వస్తారు. మీదైనా క్షేత్రంలో అద్భుతాలు చేస్తారు.
అలా చేయకుండా ఊరికే చూస్తూ ఉండిపోతే ఒక రోజు “భయపడవద్దు, ఫ్యాదర్ ఇపతోవిచ్ …” అని యెగార్ మీతో అనడం ఖాయం.
ఇవే నవలలో యెగార్ చిట్ట చివరి వాక్యాలు. అతడు ఎంత స్వరంతో అ మాట అంటాడో వింటే మీరు మామూలుగా ఉలిక్కి పడరు. అంతదాకా తేవొద్దు.