Editorial

Tuesday, April 29, 2025
కవితనాకు యుద్ధం అంటే భయం - సామాన్య గృహిణి కవితాభివ్యక్తి : రేణుక అయోల

నాకు యుద్ధం అంటే భయం – సామాన్య గృహిణి కవితాభివ్యక్తి : రేణుక అయోల

రేణుక అయోల

నాకు యుద్ధం అంటే భయం
నా నెత్తిమీద బాంబులు పడతాయని కాదు
నా పర్సులోకి ధరల పురుగులు చేరుతాయని
అరకొరగా వచ్చే జీతాల కింద గుడ్లు పెట్టీ
పిల్లల్ని కంటాయని భయం

గోధుమ పిండి డబ్బాలోకి
బియ్యం సంచిలోకి
ఇష్టపడి ఎప్పుడూ పడితే అప్పుడు తాగే టీ డబ్బాలోకి
పిల్లల స్కూటీలో పెట్రోలులోకి కనపడకుండా దూరిపోతాయి

వాటిని ఎలా దులపాలో
ఎల్లాంటి మందు పెట్టాలో తెలియదు
వాటిని మట్టు పెట్టే ప్రయత్నంలో
నాకొచ్చే జీతం అలసి ప్రాణాలు పోగొట్టుకుంటుంది

అలసట ప్రాణ భయంతో
రోజు చదివే పేపరులో
నాదేశం ఇవ్వని చదువు కోసం
పరాయి దేశాలు పట్టిన పిల్లల
కన్నీళ్లకి భయపడతాను

నాకు యుద్ధం అంటే భయం
నా జీవితంలో నేను ఇస్టపడే ప్రకృతిలోకి
నిప్పులా వస్తుందని భయం
ఎక్కడో వున్న ఆ యుద్ధ మేఘాలు
రాజకీయం అర్ధంకానీ నాయింట్లో తిష్ట వేస్తాయని భయం

నా భయాలన్ని చెప్పుకోవడానికి
నాకే అవకాశం లేదు
నా ఇంటి గుమ్మం వైపుఎవరూ చూడరు
నేనొక సామాన్య గృహిణిని

నాకు యుద్ధం అంటే భయం

కవయిత్రి రేణుక అయోల ‘ఎర్రమట్టి గాజులు’ సంపుటితో పాటు ఇటీవల ‘పృథ’ అన్న దీర్ఘ కావ్యాన్ని వెలువరించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article